Saturday 21 May 2016

ఓ ప్రియా..!!

దూరాన్ని కాలంతో భాగిస్తే వచ్చేది గమనం..
బహుశ అందుకేనేమో ప్రియా,
నీకు దూరంగ ఉన్న కాలం పెరిగేకొద్ది నా గుండె గమనం తగ్గిపోతుంది..!!

అది శూన్యమై నేను శిథిలం కాకముందే
నా దరి చేరి మన ప్రేమను పథిలం చేయి ప్రియా..!!

-ఓ భగ్న ప్రేమికుని గాథ..!!

Friday 13 May 2016

Smart Yugam

స్మార్ట్ యుగం 

                                     -భువనమిత్ర గూటూరు

"ఏంటీ ఇవాళ ఇంత టైం అవుతున్నా ఒక్క బస్సూ రావటం లేదు?" కళ్ళజోడు సరిచేసుకుంటూ అడిగాడో పెద్దాయన. "అదేనండి నేనూ చూస్తున్నాను, అసలే ఈ దారిలో ట్రాఫిక్ ఎక్కువ, ఓ వైపు ఆఫీసుకు లేట్ అయిపోతుంది, ఈ బస్సు ఎప్పటికి వచ్చెనో!" అని అంటూ ఉండగానే బస్సు వచ్చింది. నిండా జనంతో కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా ఉందా బస్సు. "అమ్మో!! ఇందులో ప్రయాణించటం నా వల్ల కాదు, తరువాతి బస్సులో వెళ్తా" అంటూ ఒక అడుగు వెనక్కి వేశాడు ఆయన. కాని నా తొందర నాతో ఆ పని చెయ్యనివ్వలేదు. మెల్లగా మెట్లపై ఉన్నవారిని తోసుకుంటూ లోపలికి వెళ్ళి, ఓ కడ్డి పట్టుకుని నిల్చున్నా. నా ముందు గుమ్మడికాయకు చీర కట్టినట్లుగా ఒకావిడ నిలబడి ఉంది. పొరపాటున నా చెయ్యి తగిలితే, నన్ను పచ్చడి చేసేలా చూపు విసిరి, మగజాతి మొత్తాన్నీ ఒక రౌండేసుకుంది. వెనకాలేమో వస్తాదుల వంశంలో పుట్టిన వరి బస్తా లాంటి కుర్రాడు నిలబడి టక టక తన వాట్సాప్  నుండి స్నేహితులందరికీ మెసేజులు పంపుతున్నాడు. కంప్యూటర్ కు ఉన్నట్లుగా సెల్ ఫోన్ కి కూడా టైపింగ్ క్లాస్సెస్ పెడితే, ఇతగాడిని గురువుగా పంపవచ్చు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు, చేసేదేమీ లేక ఒక చేత్తో ఆఫీసు బ్యాగ్, ఒక చేత్తో ఐరన్ రాడ్ పట్టుకుని నిలుచున్నా. ఇంకో మూడు నిమిషాల్లో ఆఫీసు ముంగిట్లో ఉంటా అనుకునేలోపు ఏమైందో ఏమో గాని డ్రైవర్ ఉన్నట్లుంది సడన్ బ్రేక్ వేసాడు. తన రెండు చేతులూ ఫోన్ లో మెసేజులు పెట్టటానికే వాడుతున్న ఆ వస్తాదబ్బాయ్యి ఒక్కసారిగా వచ్చి నా మీద పడ్డాడు. అంతే, ఆ బరువుకు నా బ్యాలన్స్ తప్పి, వెళ్లి నా ముందున్న గుమ్మడికాయ్ మీద పడిపోయా నేను. గుడ్డు వెళ్లి గుమ్మడికాయ్ మీద పడినా, గుమ్మడికాయ్ వచ్చి గుడ్డు మీద పడినా పగిలేది గుడ్డే అన్నట్లూ, నా గుండు మీద ఒక్కటిచ్చింది. దాంతో ఆఫీసుకు వెళ్ళవలసిన నేను ఆసుపత్రికి వెళ్ళాల్సివచ్చింది. 
                               
                             ---------------------------------------------------------------

ఆ దెబ్బ నుండి కోలుకుని తిరిగి నా పనుల్లో నేను ఉండగా ఒక రోజు నాన్న కాల్ చేసారు. విషయం విన్న తరువాత నాకు మరో దెబ్బ తగిలినట్లయ్యింది, ఎందుకంటే అది నా పెళ్ళి గురించిన విషయం.
"ఒరేయ్ వెధవ..! నీ పిజ్జా విరిగి ఛీజ్ లో పడింది రా..!"
"నాన్న! ఇప్పుడు నీ సామెతలు డీకోడ్ చేసుకునేంత టైం లేదు, ఆఫీసు లో ఉన్నాను, త్వరగా విషయం చెప్పు నాన్న."
"ఏడిసావులే వెధవ! చెప్పిందాలకించు. గంపల గురునాథం అని నా చిన్ననాటి స్నేహితుడు, ఇప్పుడు అక్కడే హైదరాబాద్ లో మునిసిపల్ కార్పొరేషన్ లో పని చేస్తునాడు, ఉదయం ఫోన్ చేశాడు, వాళ్ళమ్మాయి గంపల సునీత అని, బీ.టెక్ చేసి తరువాత ఏం చెయ్యాలో తెలీక పెళ్ళి చేసుకుంట అని చెప్పిందట. మనతో సంబంధం కలుపుకోవాలని ఆశ పడుతున్నాడు గురునాథం. నువ్వు అక్కడే పని చేస్తున్నావ్ అని, ఈ ఆదివారం సాయంత్రం అమ్మాయిని చూడటానికి వస్తావని చెప్పా."
"నాన్న!! అసలు ఏంటిది? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలిదు, మీరు లేకుండా ఒక్కడినే వెళ్ళాలా? నా వల్ల కాదు."
"ఛెస్ నోర్ముయ్! ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇలియానా కావాలని ఇంకోదేడ్చాడట.. అలా ఉంది నీ వరస. అసలు సంబంధాలు రాక జనాలు అల్లాడుతుంటే, వచ్చిన సంబంధం వదిలేస్తే ఎలా? నాకు ఈ నెలంత పొలం పనులు ఉన్నాయి. నేను లేనంటే ఏ ఒక్క వెధవ పని చెయ్యడు. కాబట్టి నేను రాలేను. నాకు తోడుగా అమ్మ ఉండక తప్పదు. పోనీ గడువు అడుగుదాం అంటే పిలిచి పిల్లనిస్తున్నాం అని అహం వీళ్ళకు అనుకుంటారు. ఈ గందరగోళం లేకుండా, ఒకసారి వెళ్లి అమ్మాయిని చూసిరా. తరువాత విషయాలు తరువాత." అంటూ నాన్న నాకు పెద్దగా ఆప్షన్ మిగల్చలేదు.

ఆదివారం సాయంత్రం...
సిగ్గూ మొహమాటాలతో గంపల వారి ఇల్లు చేరుకున్న. కుశల ప్రశ్నలు ముగిశాక అమ్మాయిని తీస్కుని వచ్చారు.
"మా అమ్మాయి బాబు, గంపల సునీత" అంటూ అంకుల్ తనను పరిచయం చేసారు. కాసేపు మా ఇద్దరిని మాట్లాడుకోమని పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. స్వతహాగా నేను అమ్మాయిలకు కొంచెం దూరమే, అందుకే ఎలా మొదలు పెట్టాలో తెలిలేదు. కాని నేను హలో అనేలోపే తను పొలోమంటూ మాట్లాడటం స్టార్ట్ చేసింది.
"హలో అండి! మీ గురించి ఏమి చెప్పనవసరం లేదు, నాన్న, అంకుల్ చెప్పేశారు. మీ ఫేస్ బుక్ ఐ.డి ఏంటి?"
అంటూ తన ఫోన్ తీసింది.
"నేను ఫేస్ బుక్ పెద్దగా వాడనండి, ఏదో ఫ్రెండ్స్ అందరితో టచ్ లో ఉండటానికి ఒక ఎకౌంటు క్రియేట్ చేసి పెట్టుకున్నా అంతే."
"అయ్యో! అదేంటి అలా అంటారు? పోనిలెండి ఇకనైనా ఆక్టివ్ గా ఉండండి అందులో.." అని ఆశ్చర్య వాణిలో చెప్పిందా అమ్మాయి.
"సరే కాని, ఇంతకు నేను నచ్చాన? నాతో పెళ్ళి మీకు ఇష్టమేనా?" అని అడిగాను ధైర్యం చేసి.
"అప్పుడే అలా ఎలా చెప్పేస్తాను?? ఇంకా మనం కొన్ని రోజులైనా మాట్లాడుకోలేదు, ఒక నెల పాటైన వాట్సప్ లో చాట్టింగ్ చేసుకోలేదు అసలు మీకు ఇంకా సెల్ఫీ టెస్ట్ పెట్టలేదు.."
"సెల్ఫీ టెస్టా..!!??" అనర్గళంగా మాట్లాడుతున్న తనకు అంతరాయం కలిగిస్తూ అడిగా నేను.
"హా అవును! నేను మీతో ఒక సెల్ఫీ తీస్కుని ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తాను, దానికి నా ఫ్రెండ్స్ నుండి వచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ చూసి మన జంట ఎలా ఉందో అర్థం చేసుకుని, మిమ్మల్ని చేసుకోవాలో వద్దో డిసైడ్ అవుతాను. అంతే! అదే సెల్ఫీ టెస్ట్  అంటే!" అని వివరించింది.
తన మాటలు విన్న తరువాత కరెంటు షాక్ కొట్టిన కాకిలా అయిపోయాను. అప్పుడే అర్థమయింది, ఆరడుగుల నాకంటే, ఆరు అంగుళాల ఆ ఫోనే తనకు భాగస్వామి అవుతుందని. గంపల వారి చెంపలు పగలకోట్టాలన్న కోపంతో అక్కడ నుండి వచ్చేశాను.
                                    ---------------------------------------------------------------

ప్రతీ గురువారం లాగానే ఇవాళ కూడా బాబా గుడికి వెళ్ళాలని ఉంది. కాని నా పక్క సీటు ప్రసాదు ఇంకా ఆఫీసుకు రాలేదు. సెలవు పెడతానని కూడా ఎవ్వరికి చెప్పలేదు. వాడు ఎందుకు రాలేదో ఏమోగాని, నాకు మాత్రం వాడి పని కుడా వచ్చి పడింది. గుడికి వెళ్ళటం ఆలస్యం అవుతుందని భోజనం కూడా మానేసి పని చేస్తుంటే, తీరిగ్గా రెండు గంటలకు వచ్చాడు ప్రసాదు.
"ఏరా ప్రసాదు!! ఇంత ఆలస్యంగా వచ్చావేంటి?? ఏమైనా సమస్యా?? ఏం జరిగింది??"
"ఎందుకడుగుతావ్ లే రా.. చెప్పుకుంటే సిగ్గుచేటు దాచుకుంటే పోదు లోటు.. నువ్వు ఎవ్వరికి చెప్పనంటే చెప్తా"
"నీ బొంద! నేనెవరికి చెప్తాన్ రా, ఏమైందో చెప్పసలు"
"ఇవాళ రోజూ కంటే తొందరగా రెడీ అయిపోయా, బస్సు లో కాకుండా సరదాగా నడిచి వద్దామని చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వస్తున్నా. అలవాటైన దారికనక ఏమీ పట్టించుకోకుండా పాటల ప్రపంచంలో విహరిస్తూ నడుస్తున్నా. కాని ఆ పోస్ట్ ఆఫీసు దగర డ్రైనేజ్ కు ఏదో రిపేర్ అనీ, మూత తెరిచి పెట్టి లోపల పని చేస్తున్నారు. ఆ సంగతి గమనించని నేను సారాసరి వెళ్ళి డ్రైనేజ్ లో పడ్డాను."
"అయ్యయో!! అలా ఎలా పడిపోయావ్ రా?? దెబ్బలు ఏమి తగల్లేదు కదా?? అంత పరధ్యానంగా ఉంటే ఎలా రా ప్రసాదు??"
"దేవుని దయ వల్ల దెబ్బలేమీ తగల్లేదు. కాని ఆ కంపుంది రా నవీనూ... అబ్బా!! పాత ఇంట్లో ఏదో మూల ఎలుక చచ్చిన కంపు కొడుతుంది అని ఓనర్ ను తిట్టి ఇల్లు మారిన నాకు, ఇప్పుడు వొళ్ళంతా అదే కంపు!! మూడు సార్లు తల స్నానం చేస్తేగాని నా ముక్కు నాకు శాపనార్ధాలు పెట్టటం మానలేదు."
"అయినా నువ్వలా అందులో పడిపోతుంటే పక్కన ఉన్నవాళ్ళు చూస్తూ ఉన్నారా? వాళ్ళైనా చెప్పాలి కదా?"
"ఎందుకు చెప్పలేదు? చెప్పారట!! కాని ఈ కొత్త హెడ్ ఫోన్స్ మోజులో సౌండ్ కొంచెం ఎక్కువ పెట్టుకోటంతో నాకు ఏమీ వినిపించలేదు రా..!!" అంటూ జరిగింది చెప్పాడు ప్రసాదు.
                              -----------------------------------------------------------------------

నేను ఇప్పుడు చెప్పిన ఈ మూడు సంఘటనలు నాలో చాలా ప్రశ్నలకు దారి తీసాయి. ఈ మూడు సంఘటనలను కలిపే మంత్రం, మనం నిత్యం వాడే ఒక యంత్రం - మొబైల్.
మనం మన అవసరం కోసం కనిపెట్టుకున్న ఈ చిన్న మొబైల్ మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో అర్థం కాలేదు. ఆ బస్సులో వస్తాదబ్బాయి అజాగ్రతతో నా మీద కాకుండా ఏ ముసలి ప్రాణం మీదో పడుంటే? మా ప్రసాదు అలాగే నడుస్తూ డ్రైనేజ్ లో పడ్డాడు కాబట్టి స్నానంతో సరిపోయింది. అదే జరగరానిది ఏమైనా జరిగుంటే? అసలు ఆ గంపల వారి సంబంధం తలుచుకుంటేనే భయమేస్తుంది, అలాంటిది పొరపాటున తను నా భాగస్వామి అయ్యుంటే??
పావురంతో ఉత్తరాలు పంపుకునే రోజుల నుండి ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఉన్నా పావు సెకండ్లో మాట్లాడగలిగే స్థాయికి వచ్చాం. సంతోషం. కాని అదే సమయంలో దానికి బానిసలైపోయాం.
ఈ మొబైల్ మన గమ్యాలకు దారి చూపిస్తూనే మనల్ని తప్పు దారి పట్టిస్తుంది, మన స్నేహితులను నిరంతరం కలుపుతూనే మనల్ని తల్లిదండ్రులకు దూరం చేస్తుంది. ఎదురుగా ఉన్న అమ్మతో కబుర్లు చెప్పటం మానేసి ఎప్పుడో కలిసి చదివిన బాలరాజుతో బాతాఖాని చేయిస్తుంది, ప్రపంచాన్ని అరచేతిలో చూపించే మాయ చేస్తూనే, రోజులో ఎంతో సమయాన్ని మాయం చేస్తుంది.
ఇది ఇలాగే  కొనసాగితే, భావాలు వాట్సప్ స్టేటస్ లలో బంధాలు ఫేస్ బుక్ పోస్ట్ లలో చూసుకోవాల్సిందే.
తిరిగి పావురాల కాలానికి వెళ్దాం అని చెప్పటం లేదు, ఈ మొబైల్ మనకు వేస్తున్న సంకెళ్ళు తెంచుకుని పావురాళ్ళ ఎగురుదాం అంటున్నా.
అవసరం ఉండి కూడా మొబైల్ ని వాడకపోవటం అమాయకత్వం, కాని అవసరానికి మించి మొబైల్ వాడటం అవివేకం...ప్రమాదం!!
మొదట్లో చెప్పాల్సింది చివర్లో చెప్తున్నానని ఏం అనుకోకండి...
"మద్యపానం, ధూమపానం మరియు అతిగా సెల్ ఫోన్ వాడటం ఆరోగ్యానికి హానికరం!!"
ఈ నగరానికి ఏమీ కాకూడదని కోరుకుంటూ.... సెలవు!!!

- భువనమిత్ర గూటూరు